
అమరావతి, 06 ఆగస్టు (హి.స.)
డిగ్రీ కోర్సుల కనీస ఫీజును పెంచాలని విద్యా శాఖ ప్రతిపాదించింది. డిగ్రీలో అన్ని గ్రూపుల ఫీజులను కనీసం 17.5 శాతం పెంచేలా చర్యలు ప్రారంభించింది. ఉన్నత విద్యా కోర్సుల తుది ఫీజుల ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ఫీజుల ఖరారుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోగా కౌన్సెలింగ్ కోసం కనీస ఫీజును పెంచారు. ఇటీవల ఇంజనీరింగ్ కోర్సుల కనీస ఫీజులను కూడా ప్రభుత్వం పెంచింది. ఈ తాత్కాలిక ఫీజులతో కౌన్సెలింగ్ పూర్తి చేసి, అనంతరం నిర్ణయించే తుది ఫీజులను ఈ అడ్మిషన్లకు అమలు చేస్తారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం బీఏ ఫీజు రూ.11 వేల నుంచి రూ.13 వేలకు పెరిగింది. బీకాం ఫీజు రూ.12 వేల నుంచి రూ.14 వేలకు పెరిగింది. బీఎస్సీకి రూ.17,500, బీబీఏ, బీబీఎం ఫీజు రూ.21 వేలు, బీసీఏకు రూ.21 వేలుగా ప్రతిపాదించారు. ఒకేషనల్ కోర్సు ఫీజు రూ.17,500, బీహెచ్ఎం/బీహెచ్ఎంసీటీకి రూ.35 వేలుగా ప్రతిపాదించారు. అలాగే లా కోర్సుల్లో మూడేళ్ల ఎల్ఎల్బీకు రూ.16 వేలు, ఐదేళ్ల ఎల్ఎల్బీకు రూ.15 వేలు, ఎంఎల్/ఎల్ఎల్ఎం ఫీజు రూ.22 వేలుగా ప్రతిపాదన చేశారు. బీఫార్మసీ, ఫార్మా-డి ఫీజు రూ.45 వేలుగా ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు మంత్రి లోకేశ్ ఆమోదం లభించాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఉన్నత విద్యాశాఖ ఫీజులపై జీవోలు జారీ చేస్తుంది. డిగ్రీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనందున వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ