
నెల్లూరు, 06 ఆగస్టు (హి.స.)
నెల్లూరు జిల్లా కావలి వైసీపీలో అసంతృప్తి మరింత పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బోగోలు మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఫొటోను ఏర్పాటు చేసి మాట్లాడిన మద్దిబోయిన వీర రఘు.. మండల కన్వీనర్ పదవితో పాటు రాజకీయాలకు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై బోరున విలపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డప్పటికీ తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదనే ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లే పార్టీ నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇటీవల బోరుగడ్డ, దగదర్తి తాళ్లూరి వర్గానికి చెందిన నేతలు పార్టీకి దూరం కాగా, ఇప్పుడు బోగోలు మండలానికి చెందిన వీర రఘు కూడా రాజీనామా చేయడం కావలి వైసీపీలో అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. ఇప్పటికే కావలి పట్టణంలోని పలువురు కీలక నేతలు కూడా పార్టీకి దూరంగా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ