
న్యూఢిల్లీ, 06 ఆగస్టు (హి.స.)
ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) వీడియోను ఫేస్బుక్ నుంచి తాత్కాలికంగా తొలగించిన వ్యవహారంలో 'మెటా' సీఈఓ మార్క్ జూకర్బర్గ్ (Mark Zuckerberg) క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంటరీ ఐటీ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (MP Nishikant Dubey) హర్షం వ్యక్తం చేశారు. దీనిపై న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో స్పందించిన ఆయన, ఇది భారతదేశ చట్టాలు, రాజ్యాంగం, పార్లమెంట్కు దక్కిన గొప్ప విజయం అని అభివర్ణించారు. దేశ సార్వభౌమాధికారానికి, భారతీయ చట్టాలకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం తలొగ్గాల్సిందేనని ఈ ఘటన నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.
140 కోట్లకు పైగా జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ప్రధాని నాయకత్వ పటిమను, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థల శక్తిని ఈ పరిణామం స్పష్టంగా తెలియజేస్తోందని ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యానించారు. భారతదేశంలో వ్యాపారం చేయాలనుకునే ఏ సంస్థ అయినా సరే, ఇక్కడి చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ ప్లాట్ఫామ్లలో పారదర్శకత, జవాబుదారీతనం లేకపోతే రాజీపడేది లేదని, భారత చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..