
హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.)
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజున
కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చవకబారు రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎల్పీ మీడియా సెంటర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కేసీఆర్, కేటీఆర్లు తెలంగాణ ఉద్యమకారులను గానీ, ప్రొఫెసర్ జయశంకరు గానీ ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జయశంకర్ సార్ పేరును ఒకటి రెండు సంస్థలకు పెట్టి వదిలేశారే తప్ప కనీసం ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆయన స్వగ్రామమైన అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మార్చాలని గ్రామస్థులు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీఓ నెంబర్ 405 జారీ చేసి అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించింది. తెలంగాణ మిగులు బడ్జెట్ ప్రాంతమని జయశంకర్ సార్ చెబితే, కేసీఆర్ మాత్రం పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అని ఆది శ్రీనివాస్ విమర్శించారు.
గాంధీ కుటుంబాన్ని విమర్శించే అర్హత కేటీఆర్కు లేదని స్పష్టం చేశారు. 'నెహ్రూ నుంచి సోనియా గాంధీ వరకు దుర్మార్గులని మాట్లాడటానికి కేటీఆర్కు నోరెలా వచ్చింది? తెలంగాణ ఇచ్చినందుకు సోనియమ్మ దుర్మార్గురాలు అయిందా? తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం మొత్తం సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకున్న విషయం మరిచిపోయారా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, గాంధీ కుటుంబాన్ని నోటికొచ్చినట్లు దుర్భాషలాడటం కేటీఆర్ అసహనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ..మా ముఖ్యమంత్రి కేటిఆర్ లా సూట్ బూట్ వేసుకుని షో చేయడానికి లేదా ప్రత్యేక విమానాల్లో తిరగడానికి ఢిల్లీ వెళ్లడం లేదు. సాధారణ ప్రయాణికుడిలా విమానంలో వెళ్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అధిష్టానం ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు వెళ్తారు. నిధుల కోసం సీఎం 75 సార్లు కాదు. 750 సార్లు అయినా ఢిల్లీ వెళ్తారు. మరి బీఆర్ఎస్ హయాంలో ఢిల్లీలో కోట్లాది రూపాయలతో తెలంగాణ భవన్ ఎందుకు నిర్మించారు? కేంద్రానికి సామంతులుగా ఉండటానికేనా? TRS పేరును BRSగా మార్చుకుని ప్రత్యేక విమానాల్లో దేశమంతా ఎందుకు తిరిగారో కేటీఆర్ చెప్పాలి” అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు అని కేటీఆర్ అనడాన్ని తిప్పికొడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలే గురువులు, శ్రేయోభిలాషులని స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజల తరఫున నిలబడి పోరాడతామని, విచ్చలవిడిగా బూతులు మాట్లాడటం కేటీఆర్ మానుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు పోస్టుమార్టం చేసుకోకుండా ఇంకా ఊహల్లోనే బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎల్సీనో ప్రభావం ఉండి వర్షాలు కురవకూడదని బీఆర్ఎస్ నాయకులు శపిస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. వర్షాలు పడుతున్నా సహించలేక, కన్నెపల్లి పంప్ హౌస్లపై ఉద్దేశపూర్వకంగా కేటీఆర్, హరీష్ రావులు రాజకీయం చేశారని, కానీ ఎల్లంపల్లి రెండు రోజుల్లోనే నిండిందని గుర్తుచేశారు. రైతులకు మంచి జరగాలని వేములవాడలో వరుణ యాగం, కొండగట్టులో గిరి ప్రదక్షిణ చేశామని, ప్రభుత్వం వర్షాల కోసం యాగం కూడా చేయబోతోందని తెలిపారు. ప్రతిపక్షంగా రైతుల సంక్షేమాన్ని ' కోరుకోవాలే తప్ప శాపనార్థాలు పెట్టడం సబబు కాదని హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..