గద్దర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే కసిరెడ్డి
గద్దర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే కసిరెడ్డి
MLA


నాగర్ కర్నూల్, 06 ఆగస్టు (హి.స)

గద్దర్ ఆశయాలు భావితరాలకు

స్ఫూర్తిదాయకమని కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన మహాకవి, ప్రజా గాయకుడు, విప్లవ సాంస్కృతిక ఉద్యమకారుడు గద్దర్ 3వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గద్దర్ తన పాటలు, కవిత్వం ద్వారా సమాజంలోని అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి సామాజిక న్యాయం, సమానత్వం, మానవ విలువల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

ప్రజల సమస్యలను తన కళారూపాల ద్వారా దేశవ్యాప్తంగా చాటి చెప్పి సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో గద్దర్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. గద్దర్ చూపిన మార్గం భావితరాలకు ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. తెలుగు సాహిత్యం, జానపద కళారంగం, ప్రజా ఉద్యమాల చరిత్రలో గద్దర్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande