
కామారెడ్డి, 06 ఆగస్టు (హి.స)
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా
పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించి, ప్రతి ఇంటికి జనుము (జ్యూట్) సంచులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు నీటి వనరులు కలుషితమవుతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ను తిన్న మూగజీవాల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని, ప్లాస్టిక్ దహనం వల్ల వెలువడే విషవాయువులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. మార్కెట్కు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబం జ్యూట్ సంచులను ఉపయోగించాలని, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులను పూర్తిగా మానేయాలని సూచించారు. ఎండ్రియాల్లో ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్ట్ను త్వరలో జిల్లాలోని ఇతర గ్రామాలకు విస్తరిస్తామని వెల్లడించారు.
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు..
ఎర్రపహడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె. వెంకటి పాల్గొని, పుట్టిన ప్రతి శిశువుకు తొలి గంటలోపు ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తల్లులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు