నీట్-యూజీలో సమూల మార్పులు: ఆన్లైన్ (CBT) విధానంలోకి మార్చేందుకు కేంద్రం కసరత్తు
నీట్-యూజీలో సమూల మార్పులు: ఆన్లైన్ (CBT) విధానంలోకి మార్చేందుకు కేంద్రం కసరత్తు
neet


హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.)

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ (NEET-UG) పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. గత కొంతకాలంగా పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న అవకతవకలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ఈ పరీక్షను భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test - CBT) ఆన్‌లైన్ విధానంలోకి మార్చే అంశాన్ని ప్రభుత్వం అత్యంత చురుగ్గా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన ఒక నివేదికలో అధికారికంగా వెల్లడించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే నీట్-యూజీ పరీక్షను 'పెన్ అండ్ పేపర్' (OMR షీట్) పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ సాంప్రదాయ పద్ధతి వల్ల ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా, స్ట్రాంగ్ రూమ్‌ల రక్షణ వంటి ప్రతి దశలోనూ లీకేజీల ముప్పు ఎక్కువగా ఉంటోంది. అదే జాతీయ స్థాయిలోని జేఈఈ (JEE Main / Advanced) వంటి పరీక్షల తరహాలోనే నీట్‌ను కూడా ఆన్‌లైన్ (CBT) విధానంలోకి మార్చడం వల్ల ప్రశ్నపత్రాలు డిజిటల్‌గా ఎన్‌క్రిప్ట్ చేయబడి నేరుగా పరీక్షా సమయానికే సిస్టమ్‌లోకి వస్తాయి. దీనివల్ల పేపర్ లీక్ అయ్యే అవకాశాలు పూర్తిగా సున్నా అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రతిపాదిత మార్పులపై సుప్రీంకోర్టు నియమించిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ (రాధాకృష్ణన్ కమిటీ) పలు సిఫార్సులను సిద్ధం చేసింది. పరీక్షా సరళీకరణ, పారదర్శకతను పెంచడం, భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయడం కోసం నేషనల్ ಟెస్టింగ్ ఏజెన్సీ (NTA) లో కూడా అంతర్గత సంస్కరణలు చేపట్టనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడటమే ఈ కీలక నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande