
హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.) ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరో 48 కాలేజీల చిట్టాను హైడ్రా అధికారులు పోలీసులకు అందజేశారు. విచారణలో భాగంగా ఒకే తరహాలో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసినట్లు గుర్తించారు. దాదాపు 56 కాలేజీలు నకిలీ ఎన్ఓసీలు సమర్పించినట్లు గుర్తించిన హైడ్రా.. మరో 176 కాలేజీలపై విచారణ జరుపుతోంది. ఐదు అంతస్తులలోపు ఉన్న భవనాల అనుమతుల కోసం ఫైర్ ఎన్ఓసీలను హైడ్రా ఇస్తుంది. ఆఫ్లైన్లో ఎన్ఓసీలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఎన్ఓసీల కోసం హైడ్రాకు దరఖాస్తు చేయకుండానే నకిలీలు సృష్టించి ఇంటర్ బోర్డుకు కాలేజీలు సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది. ఒక్కొక్క యూనివర్సిటీకి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలను కాలేజీ యాజమాన్యాలు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్వోసీల కోసం జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్ మాజీ డీజీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. హైడ్రా నివేదిక, పోలీసుల విచారణలో బయటపడ్డ అంశాలను ఆధారంగా చేసుకుని కాలేజీ యజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్