
హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.)
భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని మరింత ఆధునీకరిస్తూ, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టానికి స్వస్తి పలికేందుకు ఉద్దేశించిన ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్యాధారాల బిల్లు, 2026’ (The Bankers' Books Evidence Bill, 2026) ను లోక్‌సభ విజయవంతంగా ఆమోదించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే వాయిస్ ఓట్ (మౌఖిక ఓటింగ్) ద్వారా సభ దీనికి ఆమోద ముద్ర వేసింది. సుమారు 135 ఏళ్ల నాటి పాత ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్యాధారాల చట్టం, 1891’ స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ లావాదేవీలన్నీ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్న నేపథ్యంలో, కోర్టుల్లో డిజిటల్ ఆధారాల సమర్పణను సులభతరం చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. పాత చట్టం ప్రకారం కేవలం భౌతిక (ఫిజికల్) లెడ్జర్లు, రిజిస్టర్ల రికార్డులను మాత్రమే కోర్టులు ప్రాథమిక సాక్ష్యాలుగా స్వీకరించేవి. కానీ, ఈ కొత్త బిల్లు ద్వారా డిజిటల్, ఎలక్ట్రానిక్, వర్చువల్ మరియు క్లౌడ్ ఆధారిత బ్యాంకింగ్ రికార్డులను కూడా కోర్టు విచారణల్లో చట్టబద్ధమైన, చెల్లుబాటు అయ్యే సాక్ష్యాలుగా పరిగణిస్తారు. ఈ రికార్డులను మాన్యువల్ లేదా డిజిటల్ సంతకాలతో ధృవీకరించి సమర్పించవచ్చు.
ఈ చట్ట సవరణ ద్వారా న్యాయ ప్రక్రియలో అనవసరమైన ఆలస్యం తగ్గడమే కాకుండా, బ్యాంకు అధికారుల పనిభారం కూడా గణనీయంగా తగ్గనుంది. గతంలో చిన్న సాక్ష్యాల కోసం కూడా బ్యాంకు అధికారులు అసలు రికార్డులతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొత్త చట్టం ప్రకారం డిజిటల్ కాపీల సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రామాణీకరించడం వల్ల, కేసుతో ప్రత్యక్ష సంబంధం లేని బ్యాంకు అధికారులను కోర్టులు పదే పదే పిలిపించే అవసరం తప్పుతుంది. సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేస్తూ తీసుకువచ్చిన ఈ బిల్లు, దేశంలో డిజిటల్ గవర్నెన్స్ మరియు జ్యుడీషియల్ సంస్కరణల్లో ఒక మైలురాయిగా నిలవనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi