పార్లమెంట్ స్తంభనకు తెరదించే ప్రయత్నం: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక భేటీ
పార్లమెంట్ స్తంభనకు తెరదించే ప్రయత్నం: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక భేటీ
Rahul Gandhi 13


హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.)

పార్లమెంట్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న డెడ్లాక్ను (స్తంభన) తొలగించి, ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఉదయం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అత్యవసరంగా సమావేశమయ్యారు. సభా వేదికగా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న గందరగోళ వాతావరణాన్ని వీడి, ప్రజా సమస్యలపై చర్చించేందుకు వీలుగా ఈ వ్యూహాత్మక చర్చలు జరిగాయి.

ఈ భేటీలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) బిల్లు, విదేశీ విరాళాల నియంత్రణ సవరణ (FCRA) బిల్లు-2026 లపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ బిల్లులపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను, ఆందోళనలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ఈ బిల్లులను ఆమోదించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని, సభలో నిర్మాణాత్మకమైన చర్చకు రావాలని ఆయన కోరారు.

మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం కీలక బిల్లులపై పూర్తిస్థాయి చర్చ జరగాలని, విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా సభ సాగాలన్నదే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ అగ్రనేతల భేటీతో పార్లమెంట్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రతిష్టంభన త్వరలోనే వీడి, సభా కార్యక్రమాలు తిరిగి యథావిధిగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande