
తిరుమల, 09 ఆగస్టు (హి.స.)
నకిలీ ఆధార్ కార్డులతో తిరుమలలో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న కేటుగాళ్ల బృందాన్ని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణాకు చెందిన ఇరప్ప కాలప్ప, శ్రీనివాస్, బిహార్కు చెందిన అముల్ కుమార్ సింగ్, కర్ణాటకకు చెందిన ప్రకాష్, ఏపీకి చెందిన సందీప్, విష్ణువర్ధన్ బృందంగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. ఇతరుల ఆధార్ కార్డులో ఫొటోలు, పేర్లు, నంబర్లు మార్చి వాటి ద్వారా తిరుమలలో సామాన్య భక్తులకు గదులు కేటాయించే సీఆర్వో కార్యాలయంలో రూ.50, రూ.100, రూ.1000 ధరల గదులను అద్దెకు తీసుకుంటున్నారు. వాటిని గదుల కోసం ఎదురుచూసే భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమలలోని హోటళ్లలో పనిచేసే కార్మికులు, వీధుల్లో తిరిగి వ్యాపారం చేసుకునే హాకర్ల ద్వారా ఈ దళారీలు గదుల దందాను భారీగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కార్మికులు, హాకర్లను సీఆర్వో క్యూలైన్లోకి పంపి గది అద్దె వీరే చెల్లిస్తారు. క్యూలైన్లో ఉండి గదిని తీసిచ్చినందుకు కార్మికులు లేదా హాకర్లకు రూ.200 నుంచి రూ.500 వరకు ఇచ్చి గది తాళాలు తీసుకుంటారు. వీటిని గదుల అవసరం ఉన్న భక్తులకు ఇచ్చి 12 గంటల సమయానికి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. 12 గంటలు దాటగానే రొటేషన్ పద్ధతిలో మరొకరికి కేటాయించి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమల టూటౌన్ పోలీసులు శనివారం ఉదయం సీఆర్వో వద్ద ఈ ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఐదు సెల్ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ