
కర్నూలు, 09 ఆగస్టు (హి.స.) తెలుగు రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో అర్థరాత్రి వేళ ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోని హైదరాబాద్ సహా రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా విపరీతమైన పగటి వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడి తీవ్ర ఉపశమనం లభించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వైపు ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని, రానున్న కొన్ని గంటల్లో రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగుతోంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా, కడప జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేసింది. అర్థరాత్రి నుండి మారిన ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, వైర్ల సమీపంలోకి వెళ్లకూడదని చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV