
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి వారి ఆత్మగౌరవాన్ని పెంచేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.
గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు. మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ తిరుపతిగా వర్ధిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారని బీర్ల అయిలయ్య తెలిపారు. భక్తుల రద్దీ, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్ట బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు, స్థానిక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థానానికి ఎలక్ట్రిక్ బస్సులను నడపడంతో పాటు ఆర్టీసీ డిపోకు కొత్త బస్సులను మంజూరు చేయాలని రవాణా శాఖ మంత్రిని కోరారు. బస్సుల సంఖ్య పెరిగితే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..