అసెంబ్లీ ముట్టడికి యత్నించిన నేతల అరెస్ట్
రజకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రజకుల సంఘం ఆధ్వర్యంలో గురువారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.
Assembly


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)

రజకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రజకుల సంఘం ఆధ్వర్యంలో గురువారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. శాసనసభ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన సంఘం నేతలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రజకులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభించిందని, 250 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పిన ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాత బిల్లులను కూడా చెల్లించకుండా పెండింగ్లో పెట్టిందని మండిపడ్డారు. రజక సంఘం డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులను నియోజకవర్గాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పక్షంలో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై గతంలో పలుమార్లు మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ చాకలి ఐలమ్మ మా నాయనమ్మ అని చెప్పుకొని తిరిగిన ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు ఆమె గుర్తురావడం లేదా? అని ప్రశ్నించారు. ట్యాంక్ బండ్పై ఐలమ్మ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించడంలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉచిత విద్యుత్ బకాయిలను విడుదల చేయడంతో పాటు రజకుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande