
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి
రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీస్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు సమర్పించారు. శాసనసభ వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సీఎం రేవంత్రెడ్డి ఒక నకిలీ సోషల్ మీడియా పోస్టును ప్రస్తావించారని విపక్ష నేతలు ఆరోపించారు.
అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ 'అంతర్జాతీయ కార్యదర్శి' అని ఉటంకిస్తూ కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అంతర్జాతీయ కార్యదర్శి అనే పదవే లేదని, సంధ్యారావు అనే వ్యక్తికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఐటీ సెల్ సృష్టించిన నకిలీ ఖాతా ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు.
అత్యున్నతమైన శాసనసభ గౌరవాన్ని తగ్గించేలా నకిలీ ఖాతాల ప్రచారాన్ని వేదికగా చేసుకున్నందున సీఎం రేవంత్ రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు