ఘరానా సైబర్ మోసగాడు అరెస్ట్
నిరుద్యోగులు, అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడు సైబర్ పోలీసులకు చిక్కాడు.
Cyber crime


అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)

నిరుద్యోగులు, అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడు సైబర్ పోలీసులకు చిక్కాడు.

దీనిపై సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో సైబర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మధురవాడలో నివాసముంటున్న ఎం.కామరాజు (51) ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, సంపత్వినాయక్ టెక్నాలజీస్, అర్నాట్ టెక్నాలజీస్ అనే సంస్థలను నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు.

పీఎంఈజీపీ, ముద్రా తదితర ప్రభుత్వ పథకాల కింద రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రాయితీ రుణాలు ఇప్పిస్తానని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఒప్పంద ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం, డేటా ఎంట్రీ, బీపీఓ ఉద్యోగాలు కల్పిస్తానని పలువురికి ఆశ చూపాడు. బాధితుల నుంచి ఆధార్, పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించాడు.

ప్రాజెక్టు రిపోర్టు తయారీ, ఫ్రొసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, ల్యాప్టాప్, శిక్షణ తదితరాల వివిధ ఛార్జీల పేర్లతో నగదు, ఫోన్పే, బ్యాంకు ఖాతాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ బాధితుడికి రూ.10 లక్షల రుణం మంజూరు చేయిస్తానని చెప్పి విడతల వారీగా రూ.65,700 వసూలు చేశాడు. అతనికి రుణం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకోవడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఇప్పటి వరకు పలువురు బాధితుల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక ధర్యాప్తులో తేలింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande