
జగిత్యాల, 10 సెప్టెంబర్ (హి.స.) రైతులకు ప్రకటించిన విద్యుత్ సరఫరాలో కోతలు విధించడాన్ని నిరసిస్తూ పలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు గురువారం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆందోళనకు దిగారు.
పట్టణంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట ఉన్న జగిత్యాల-రాయికల్ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాలిపోయిన విద్యుత్ మోటార్లను రహదారిపై ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వ్యవసాయానికి కనీసం 12 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు పునరుద్ధరిస్తారో రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు.
అప్పటిలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే రహదారిపై వంటావార్పు తదితర కార్యక్రమాలు చేపట్టి ఆందోళనను ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..