
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
దుర్గాపురం స్టేజ్ సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఒక లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీల క్యాబిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నిత్య రద్దీగా ఉండే జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు లారీలు రోడ్డుపై అడ్డంగా నిలిచిపోవడంతో విజయవాడ వైపు వెళ్లే మార్గంలో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందిన వెంటనే కోదాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..