
వరంగల్, 10 సెప్టెంబర్ (హి.స.)
ఏకాంత ప్రదేశాల్లో ఉండే జంటలను బెదిరించి వీడియోలు తీసి డబ్బులు వసూలు చేసేవారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని మామునూర్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో మేకల గౌతమ్ అనే యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయని, నిందితుల నుంచి కత్తి, రెండు ద్విచక్రవాహనాలు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఆదేశాలతో మామూనూరు ఏసీపీ వెంకటేష్ నిందితుల వివరాలు తెలిపారు.
తిమ్మాపూర్, పరిసర ప్రాంతాలకు చెందిన సామల పవన్ (25), ఈద జానకిరామ్ (22), ముద్దేపాక మనోజ్ (21), ఎస్ఈడీ హుస్సేన్ (24) కొంతకాలంగా ముఠాగా ఏర్పడి భట్టుపల్లి, అమ్మవారిపేట శివారు ప్రాంతాల్లో తిరిగేవారని, ఏకాంతంగా ఉన్న జంటలను కత్తితో బెదిరించి వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసేవారని, ఆగస్టు 30న భట్టుపల్లి రోడ్డు వద్ద ఓ జంటను బెదిరించి వీడియో తీసిన ఘటనతో వివాదం మొదలైనట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..