
తిరుమల, 10 సెప్టెంబర్ (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. త్వరలో బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లు ఫుల్ అవ్వగా.. బాట గంగమ్మ గుడి వద్ద భక్తులు క్యూ లైన్లోకి చేరుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 5-7 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. రూ.300 టోకెన్లు ఉన్న భక్తులకు శీఘ్రదర్శనానికి 4-6 గంటల సమయం పడుతుందని పేర్కొంది.
నిన్న (బుధవారం) స్వామివారిని 77,670 మంది భక్తులు దర్శించుకోగా.. 33,904 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు సమకూరింది. శ్రీవారి ప్రసాదంగా 4.59 లక్షల లడ్డూలను విక్రయించారు. 3.04 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV