
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)
మేడ్చల్ పట్టణంలో శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు సంక్షేమ వసతి గృహాల నిర్వహణను పరిశీలించింది.
తొలుత పట్టణంలోని పలు చౌక ధరల దుకాణాలను (రేషన్ షాపులు) కమిషన్ బృందం సందర్శించింది. అక్కడ నిల్వ ఉన్న సరుకుల వివరాలు, ఈ-పాస్ యంత్రాలు, పంపిణీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది.
లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని డీలర్లను అడిగి తెలుసుకున్నారు.
రికార్డుల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కమిషన్ చైర్మన్, సభ్యులు సూచించారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు.
అనంతరం మేడ్చల్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను కమిషన్ బృందం సందర్శించింది. మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకాహారం అందించడంలో ఎలాంటి అలసత్వం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు