
కర్నూలు, 11 సెప్టెంబర్ (హి.స.): కర్నూలు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచి, 100 శాతం ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించేందుకు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
ఇంటింటి చెత్త సేకరణ వాహనాలు చెత్తను తరలించేందుకు ప్రతిసారీ గార్గేయపురం డంప్యార్డుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జీటీఎస్ తరహాలో రెండు చెత్త బదిలీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ రోజు ఉదయం విశాల్ మార్ట్ వెనుక ఈ-ఆటోల చార్జింగ్ కేంద్రం వద్ద, జొహరాపురం రోడ్డులోని జీటీఎస్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలను కమిషనర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇంటింటి చెత్త సేకరణ వాహనాలు సేకరించిన చెత్తను తరలించేందుకు గార్గేయపురం డంప్యార్డుకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. దీంతో వాహనాలు డంప్యార్డుకు వెళ్లి తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు, ఆ సమయాన్ని ఇంటింటి చెత్త సేకరణకు పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం లేకపోయేదన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా జీటీఎస్ తరహాలో రెండు చెత్త బదిలీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెంకటరమణ కాలనీలోని విశాల్ మార్ట్ వెనుక ఈ-ఆటోల చార్జింగ్ కేంద్రం వద్ద ఒకటి, జొహరాపురం రోడ్డులోని జీటీఎస్ వద్ద మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కేంద్రాల్లో చెత్తను సులభంగా పెద్ద కంపాక్టర్ వాహనాల్లోకి బదిలీ చేసేందుకు ప్రత్యేక ర్యాంపులను నిర్మించినట్లు చెప్పారు. మొత్తం 3 కంపాక్టర్లు ఇక్కడ చెత్త తరలింపు చేస్తుంటాయన్నారు.
ఇకపై ఇంటింటి చెత్త సేకరణ వాహనాలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చెత్తను సేకరించిన అనంతరం సమీపంలోని బదిలీ కేంద్రానికి చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద కంపాక్టర్ వాహనాల్లోకి చెత్తను బదిలీ చేస్తాయని కమిషనర్ తెలిపారు. అనంతరం కంపాక్టర్ వాహనాలు చెత్తను నేరుగా గార్గేయపురం డంప్యార్డుకు తరలిస్తాయని చెప్పారు. ఈ విధానం ద్వారా చెత్త సేకరణ వాహనాలు గార్గేయపురం డంప్యార్డుకు వెళ్లి తిరిగి రావడానికి పట్టే సమయం తగ్గుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఆదా అయ్యే సమయాన్ని పూర్తిగా ఇంటింటి చెత్త సేకరణకు వినియోగించుకోవడం ద్వారా వాహనాలు ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండి మరిన్ని ఇళ్ల నుంచి చెత్తను సేకరించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. తద్వారా 100 శాతం ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా సాధించేందుకు ఈ విధానం దోహదపడుతుందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV