
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బొల్లారం మిలటరీ మద్రాసు రెజిమెంట్ వెపన్స్ చోరీ కేసులో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు మిలటరీ అధికారులు, రాష్ట్రంలోని వివిధ పోలీసు విభాగాలు, కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు జరిపిన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు అత్యంత ఆసక్తిని రేపుతోంది. ఈ మిస్టరీ చేధన వెనకాల సాగిన పోలీసుల కష్టం, దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారుల మేధోమధనంతో సాగిన విచారణ ఉత్కంఠను రేపే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా జరిగిందని ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రా పోలీసులతో పాటు ఇతర దర్యాప్తు సంస్థల అధికారుల్లో టాక్. 11 రోజుల పాటు సాగిన ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఓ హిస్టరీ గా గుర్తింపు తెచ్చుకుందని స్పష్టమవుతుంది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాదాపు 500 సీసీ కెమెరాలను నిశితంగా గమనించారు. 29, 30వ తేదీ రాత్రులకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ను సెకన్ టూ సెకన్ పోలీసులు స్కానింగ్ చేశారు. వీటిని చూస్తున్న పోలీసులు రాత్రి సమయంలో లైట్ వెలుతురుకు వచ్చే నీడలను కూడా అనుమానించి వాటిని కూడా విశ్లేషించుకున్నారు. ఇలా దాదాపు ఒక 20 నుంచి 30 వరకు నీడలను కూడా అనుమానంతో మ్యాపింగ్ చేసుకుని పోలీసులు ఫాలో అయ్యారు. చివరకు అవి మనుషులు కాదని, ఇతర వస్తువులకు సంబంధిచన షాడోలన్ని గుర్తించారు. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ప్రాథమిక ఆధారాలతో టైం గ్యాప్ మేనేజ్ మొంట్ ప్రక్రియతో మ్యాపింగ్ చేసి అనుమానితుడు మాజీ సైనిక ఉద్యోగి మల్లేష్ను గుర్తించి అతనిని షాడో చేసి.. చివరకు మిస్టరీని చేధించారు. ఒక నైట్ ఫుటేజ్ను జల్లెడ పట్టేందుకు పోలీసులు కంటిన్యూగా రెండు రోజుల పాటు విడియోలు చూస్తు ఉండిపోయారని పోలీసు అధికారులు తెలిపారు.
బొల్లారం మిలటరీ వెపన్స్ మిస్సింగ్ సంఘటనపై బొల్లారం పోలీసులు ముందుగా చోరీ కేసును నమోదు చేశారు. నిందితుడు మాజీ సైనిక ఉద్యోగి మల్లేష్ అరెస్టు తర్వాత దర్యాప్తులో వెలుగు చూసిన ఆధారాలతో అతనిపై ఆర్మ్స్ యాక్ట్ కింద అభియోగాన్ని నమోదు చేశారు మల్లేష్ నుంచి మిస్సింగ్ అయిన 12 తుపాకులు, 2 వేల బుల్లెట్లు, నైట్ విజన్ బైనాక్యూలర్, మ్యాగజైన్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటిని కోర్టుకు అప్పజెప్పనున్నారు. రిమాండ్లో ఉన్న మల్లేష్ను మరోసారి కస్టడీలోకి తీసుకుని ఈ వెపన్స్ మిస్సింగ్ వెనకాల ఏమైనా ఇతర కుట్రలు దాగి ఉన్నాయనే అంశాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..