
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)
తన కుటుంబ సభ్యుల కంటే ముందుగా తనను రోశయ్యనే గుర్తించారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్ భగాయత్లో ఆర్య వైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... 2007లో తాను మొదటిసారి శాసనమండలికి వెళ్లినప్పుడు దూకుడుగా మాట్లాడితే రోశయ్య తనను పిలిచి మాట్లాడారని అన్నారు. ఈ మధ్య కాలంలో రాజకీయనాయకులు చదువుకుని మాట్లాడేవాళ్లు తగ్గిపోయారని, నువ్వు హోం వర్క్ చేస్తే నీకు మంచి రాజకీయ భవిష్యత్ ఉందని చెప్పారన్నారు. కొంత దూకుడు తగ్గిస్తే భవిష్యత్ లో మంచి నాయకుడు అవుతావని చెప్పారన్నారు. తన సొంతవారి కంటే ముందు తనను రోశయ్యనే గుర్తించారని చెప్పారు. చాలాసార్లు రోశయ్యతో తాను సంవాదన చేశావాడినని అన్నారు. ఆయన చురకలు అంటించేవారే కానీ తిట్టేవారు కాదని చెప్పారు. అందుకే రాష్ట్రం విడిపోయినా అలాంటి నాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టామని అన్నారు.
రోశయ్య బతికున్నప్పుడు తమ గ్రామాన్ని విడిచి నాలుగు దశాబ్దాలు అయ్యిందని, బల్కంపేటనే తన ఊరని, తాను హైదరాబాదీనేనని చెప్పారన్నారు. మంచైనా చెడైనా హైదరాబాద్ తోనే తనకు అనుబంధం ఏర్పడిందన్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పదహారు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చాలా మంది ముఖ్యమంత్రులు మారారని కానీ ఆర్థికమంత్రి మారలేదని, రోశయ్యనే ఆర్థికమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు 16వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండటానికి కారణం రోశయ్యనే అని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..