బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుండగా తిరుమల గిరులు వైకుంఠాన్ని తలపిస్తున్నాయి.
తిరుమల


తిరుమల , 13 సెప్టెంబర్ (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుండగా తిరుమల గిరులు వైకుంఠాన్ని తలపిస్తున్నాయి.

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది అధికమాసం రావడంతో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటగా భాద్రపదంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అనంతరం అశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 14న రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం 15న సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా సాగే ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 15న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదే రోజు రాత్రి జరిగే పెద్దశేష వాహన సేవలోనూ సీఎం పాల్గొంటారు. అనంతరం 16న ఉదయం నవీకరించిన ఎస్వీ మ్యూజియం, రిలయన్స్ సంస్థ విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులు, భక్తుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకే అత్యున్నత ప్రాధాన్యం కల్పిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేస్తూ, సాధారణ సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక ప్రివిలేజ్ దర్శనాలను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడసేవ, ముగింపు రోజైన చక్రస్నానం ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో కలిసి టీటీడీ అధికారులు నిశితంగా పరిశీలించారు. గరుడసేవ రోజున రద్దీని నియంత్రించేందుకు భద్రతా ప్రమాణాలను పక్కాగా సిద్ధం చేశారు. చక్రస్నానం నిర్వహించే శ్రీవారి పుష్కరిణి వద్ద ప్రవేశ, నిష్క్రమణ మార్గాల పనులను ఇప్పటికే పూర్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande