
శ్రీకాళహస్తి, 13 సెప్టెంబర్ (హి.స.) శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్లో వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా భక్తులకు వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు.
1995 నుంచి ట్రస్ట్ చైర్మన్ సురేంద్రరెడ్డి తన స్వంత ఖర్చులతో వినాయక విగ్రహాలను తయారు చేయించి, ప్రతి ఏడాది సుమారు 800 విగ్రహాలు, భక్త బృందాలకు ఉచితంగా అందజేస్తున్నారు.
తిరుపతి జిల్లా బి.ఎన్. కండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరు గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి, వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు కొనుగోలు చేసేందుకు భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, స్వయంగా విగ్రహాలను తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పించారు.
ఇందులో భాగంగా 1995లో తన వద్ద ఉన్న బంగారు ఉంగరాన్ని కుదువపెట్టి వచ్చిన నగదుతో ఐదు వినాయక విగ్రహాలను తయారు చేయించి భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.
విగ్రహాల పరిమాణాన్ని బట్టి ఒక్కో విగ్రహం తయారీకి రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు ఖర్చవుతుందని సురేంద్రరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పేపర్, పిండి గుజ్జు తదితర పర్యావరణహిత పదార్థాలతో విగ్రహాలను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV