
హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.) ఈనెల 7న తెలంగాణ అసెంబ్లీ
గేట్-3 వద్ద చోటుచేసుకున్న ఘర్షణ ఘటనపై సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసుల నోటీసుల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్రెడ్డి, పీఆర్వో మహేశ్ సోమవారం విచారణకు హాజరయ్యారు.
విచారణలో భాగంగా వారిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పోలీసుల మధ్య జరిగిన తోపులాట వెనుక ముందస్తు ప్రణాళిక ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
అసెంబ్లీ గేట్-3 వద్ద గొడవ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేయాలని మీకు ఎవరు చెప్పారు? అనే కోణంలో అధికారులు వారి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విచారణ సమయంలో ఈ ఘటనకు సంబంధించిన 'సీన్ రీ-కన్స్ట్రక్షన్' చేసేందుకు సైఫాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. మహేందర్రెడ్డి, మహేశ్లను అసెంబ్లీ గేట్ వద్దకు తీసుకువెళ్లి పరిశీలించాలని భావించగా పోలీసుల చర్యను లాయర్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..