
నల్గొండ, 14 సెప్టెంబర్ (హి.స.)
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్తో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ సహకరించారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.
సోమవారం నల్గొండలోని రామాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతించేలా నాటి ప్రభుత్వం వ్యవహరించడం వల్ల తెలంగాణకు తీరని నష్టం జరిగిందని మంత్రి ఆరోపించారు.
శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణకు దక్కాల్సిన నీటిని వినియోగించుకునే హక్కులు, అవకాశాలను గత పాలకుల నిర్ణయాల కారణంగా కోల్పోయామని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులకు గత ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి జరిగిన నష్టంపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి హక్కుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు ఎస్ఎల్బీసీ అత్యంత కీలకమని మంత్రి తెలిపారు. 2028 నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు