అర్ధరాత్రి నగరంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
అర్ధరాత్రి నగరంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
Commissioner


నిజామాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో పోలీస్ శాఖ భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అర్ధరాత్రి వేళ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ మండపాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ, ట్రాఫిక్ పరిస్థితులు, ప్రజల రాకపోకలు, రాత్రి వేళ భద్రతా చర్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

గణేష్ ఉత్సవాల సందర్భంగా రాత్రి వేళల్లో భక్తులు, యువత అధికంగా సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, డీజేలు, అధిక శబ్దం, రోడ్లపై అనవసరంగా గుంపులు చేరడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande