వాగుపై కర్రల వంతెన నిర్మించిన అల్లూరి జిల్లా గిరిజనులు
అల్లూరి జిల్లా గిరిజనులు నిత్యం నరకయాతన మిగిల్చే వాగుపై కర్రల వంతెనను నిర్మించుకుని స్ఫూర్తిని నింపారు.
Bridge


ఆంధ్రప్రదేశ్ , 14 సెప్టెంబర్ (హి.స.)అల్లూరి జిల్లా గిరిజనులు నిత్యం నరకయాతన మిగిల్చే వాగుపై కర్రల వంతెనను నిర్మించుకుని స్ఫూర్తిని నింపారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల ప్రజల ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లోతుగెడ్డ జంక్షన్ నుంచి బూడిదపాడు మీదుగా వనజాజుల, బోయపాడు గ్రామాలకు వెళ్లే మార్గంలో పెద్ద వాగు ప్రవహిస్తోంది. బోయపాడు, బూడిదపాడు, వనజాజుల, కప్పల, బెన్నవరం, కోరుకొండ, గొడుగుమామిడి, కరకపల్లి గ్రామాల ప్రజలకు మండల కేంద్రమైన చింతపల్లికి వెళ్లాలంటే ఈ మార్గమే అత్యంత దగ్గర. కానీ చింతపల్లికి ప్రయాణమే గిరిజనులకు ఒక సాహసయాత్ర. ఏ చిన్న వర్షం కురిసినా ఆ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. గిరిజనులంతా స్వయం కృషితో అద్భుతం చేశారు. వందలాది మంది యువకులు, పెద్దలు చేయీచేయీ కలిపారు. శ్రమదానం అనే ఆయుధంతో తమ కష్టాలకు చెక్ పెట్టారు. అడవి నుంచి బలమైన కర్రలను సేకరించి వాగు మధ్యలో భారీ మూలస్తంభాలను పాతారు. ఎండనక, వాననక రేయింబవళ్లు శ్రమించి అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేశారు. ఆ వాగుపై ఒక బలమైన తాత్కాలిక కర్రల వంతెలను అద్భుతంగా నిర్మించారు. గిరిజనులు నిర్మించిన కర్రల వంతెన తాత్కాలికంగా వారి రాకపోకలను సులభతరం చేసింది. ఈ వంతెన నిర్మాణంతో మండల కేంద్రం చింతపల్లికి దూరం తగ్గింది. అధికారులు, యంత్రాంగం ఇప్పటికైనా వంతెన నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande