
హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)
వినాయక విగ్రహం కొనుగోలు
చేయడానికి వెళ్లిన వ్యక్తులకు, విగ్రహాల విక్రయ దారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం చౌదరిగూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఆదివారం అర్ధరాత్రి వినాయక విగ్రహం కొనుగోలు చేసేందుకు జోడిమెట్ల సమీపంలోని వినాయక విగ్రహాల షెడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ విగ్రహాలు విక్రయిస్తున్న వారితో ధర, కొనుగోలు విషయంలో మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఘర్షణలో విగ్రహాలు విక్రయిస్తున్న రాజస్థాన్కు చెందిన చోగారామ్ అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడే ఉన్న చొగారామ్ కుటుంబ సభ్యులు, మరికొంతమంది మూకుమ్మడిగా ఎదురు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చౌదరిగూడకు చెందిన పసులాది కిరణ్ (34) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం అక్కడే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు