
ముంబై, 15 సెప్టెంబర్ (హి.స.)
దేశీయ సూచీలు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. రోజంతా ఒడిదుడుకుల్లో కొనసాగిన మార్కెట్లు చివరికి భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ రోజువారీ కనిష్ఠ స్థాయిలకు సమీపంలో క్లోజ్ అయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల వెల్లువ కొనసాగి బెంచ్మార్క్ సూచీలు తీవ్ర పతనానికి గురయ్యాయి.
సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు ఒక శాతం మేర కుదేలై కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు దలాల్ స్ట్రీట్ను తీవ్రంగా దెబ్బతీశాయి. పశ్చిమాసియా సంక్షోభం ముదిరి అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటి ఎగబాకడం భారత ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారింది. చమురు ధరల పెరుగుదల వల్ల దిగుమతుల భారం పెరిగి ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు (CAD) మరింత తీవ్రమవుతాయన్న ఆందోళనలతో పాటు, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.96 శాతానికి పైగా పెరగడం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.
భారత కరెన్సీ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోవడం, మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంచుతుందన్న అంచనాలు మార్కెట్ పతనానికి ప్రధాన ఆజ్యం పోశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు