
తిరుమల, 16 సెప్టెంబర్ (హి.స.) కలియుగ ప్రత్యక్ష దైవం అయిన తిరుమల వేంకటేశ్వరస్వామి క్షేత్రం తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది.తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
వినాయక చవితి కావడం, ప్రజలంతా మండపాలకు పరిమితం కావడంతో తిరుమలలో రద్దీ తగ్గింది. దీంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కేవలం 6గంటల వ్యవధిలోనే పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. రద్దీ నియంత్రణలో ఉండటంతో క్యూలైన్లలో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గడం వల్ల సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు.
మరోవైపు నిన్న ఒక్కరోజే మొత్తం 61,361 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 18,722 మంది భక్తులు కల్యాణకట్ట లో స్వామి వారికి తలనీలాలు సమర్పించి భక్తిప్రపత్తులు చాటుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.7 కోట్లు వచ్చినట్లు దేవస్థానం వెల్లడించింది. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాల వితరణ సజావుగా సాగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV