
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
చరిత్ర కొన్ని తేదీలను సాదాసీదా రోజులుగా దాచిపెడుతుంది, మరికొన్ని తేదీలను నిప్పు కణికలుగా మారుస్తుంది. తెలంగాణ నేలపై సెప్టెంబర్ 17 అటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక అగ్నిపర్వతం. 1947 ఆగస్టు 15న దేశమంతా త్రివర్ణ పతాకం నీడన స్వేచ్ఛావాయువులు పీలుస్తుంటే, హైదరాబాద్ సంస్థానంలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నల్లటి చీకట్లను వ్యాపింపజేశాడు. భౌగోళికంగా భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, తెలంగాణ ప్రజలు ఏడో నిజాం రాచరికపు ఇనుప సంకెళ్లలోనే బంధీలుగా ఉండిపోయారు. ఆ సంకెళ్లను తెంచుకుని, నిరంకుశత్వంపై పోరాడి సాధించుకున్న స్వేచ్ఛా పర్వదినమే సెప్టెంబర్ 17.
రజాకార్ల అరాచకాలు - ప్రజల సాయుధ తిరుగుబాటు
విలీనం అనే పదం రెండు స్వచ్ఛంద వ్యవస్థల మధ్య ఒప్పందాన్ని సూచిస్తుంది. 1948లో జరిగింది ఏ ఒప్పందమూ కాదు, అది ఒక జాతి విముక్తి పోరాటం! నిజాం పాలకుడికి మద్దతుగా ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు సాగించిన దౌర్జన్యాలు, అమానుష అరాచకాలు వర్ణనాతీతం. పన్నుల పేరుతో జనాన్ని పీడించడం, ఊళ్లకు ఊళ్లను తగలబెట్టడం, అమాయక రైతాంగంపై నరమేధం సాగించడం నిత్యకృత్యమైంది. అటువంటి దారుణ అణచివేతకు వ్యతిరేకంగా 'మా భూమి, మా భుక్తి, మా ముక్తి' అంటూ తెలంగాణ నేల నలుమూలల నుంచి విప్లవ జ్వాలలు ఎగిసిపడ్డాయి. వీరనారి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షాయెబుల్లాఖాన్, రావి నారాయణరెడ్డి వంటి ఎందరో యోధులు పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టారు.
ఆపరేషన్ పోలో - హైదరాబాద్ భరతమాత ఒడిలోకి
పోరాటం తీవ్రరూపం దాల్చడంతో అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 1948 సెప్టెంబర్ 13న 'ఆపరేషన్ పోలో' పేరుతో సైనిక చర్యను ప్రారంభించారు. మేజర్ జనరల్ జయంతో నాథ్ చౌధురి నాయకత్వంలో భారత సైన్యం నలువైపుల నుంచి హైదరాబాద్ వైపు దూసుకెళ్లింది. సైన్యం ధాటికి నిజాం దళాలు, రజాకార్లు చిత్తుగా ఓడిపోయారు. ఐదు రోజుల సైనిక చర్య అనంతరం, సెప్టెంబర్ 17న ఏడో నిజాం నవాబు రేడియోలో శరణాగతి ప్రకటన చేశారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అధికారికంగా విలీనమైంది. రజాకార్ల భయంకర పాలన అంతమై మువ్వన్నెల జెండా ఆకాశంలో రెపరెపలాడింది.
రాజకీయ స్వార్థాల కోసం ఈనాటికీ సెప్టెంబర్ 17 చరిత్రను 'విలీనం' అనే మృదువైన పదంతో కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రజాకార్ల తుపాకీ గుండ్లకు ఎదరొడ్డి నిలిచి, నిజాం రాచరికాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేసిన తెలంగాణ పౌరుషానికి 'విమోచనం' అనే పదమే నిజమైన గౌరవం. తెలంగాణ ప్రజల రక్తం, త్యాగాలు, అశ్రునయనాల సాక్షిగా సిద్ధించిన ఈ స్వేచ్ఛా దినోత్సవం తరతరాలకు స్ఫూర్తినిచ్చే దివ్య చారిత్రక ఘట్టం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi