ఐదవ ఎడిషన్ 'సెమికాన్ ఇండియా 2026' సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఐదవ ఎడిషన్ 'సెమికాన్ ఇండియా 2026' సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Narendra Modi (File)


న్యూఢిల్లీ 17 సెప్టెంబర్ (హి.స.)

న్యూఢిల్లీలోని ద్వారకలో గల ప్రతిష్టాత్మక 'యశోభూమి' కన్వెన్షన్ సెంటర్‌లో నేడు ఐదవ ఎడిషన్ 'సెమికాన్ ఇండియా 2026' (SEMICON India) సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ మరియు ఎలక్ట్రానిక్స్ చిప్ తయారీ హబ్‌గా మార్చే వ్యూహాత్మక లక్ష్యంతో ఈ మెగా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఈ సదస్సును సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నారు. నేటి నుండి మూడు రోజుల పాటు అనగా సెప్టెంబర్ 17 నుండి 19 వరకు ఈ ఈవెంట్ కొనసాగనుంది.

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) మరియు గ్లోబల్ ఇండస్ట్రీ అసోసియేషన్ (SEMI) సంయుక్తంగా ఈ భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల నుండి ప్రతినిధులు, సుమారు 600 కంటే ఎక్కువ అంతర్జాతీయ మరియు దేశీయ సాంకేతిక కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇందులో జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, మలేషియా, మరియు స్వీడన్ దేశాలకు చెందిన 6 ప్రత్యేక అంతర్జాతీయ పెవిలియన్లతో పాటు భారతదేశంలోని 12 రాష్ట్ర ప్రభుత్వాల స్టాల్స్, 40 కి పైగా సరికొత్త స్టార్టప్‌ల ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు.

ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గడిచిన కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశం చిప్ డిజైన్ మరియు గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ రంగంలో తిరుగులేని మౌలిక వసతులను మరియు నైపుణ్యాన్ని సాధించిందని కొనియాడారు. అంతకుముందు రోజు రాత్రి ఆయన మైక్రాన్, ఫాక్స్‌కాన్, ఇంటెల్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి ప్రఖ్యాతి గాంచిన ప్రపంచ అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీల సీఈఓలతో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అపారమైన అవకాశాలపై చర్చించారు. ఈ ప్రదర్శన ప్రారంభం కావడంతో దేశీయంగా సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ మరియు అనుబంధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల షేర్లు నేడు మార్కెట్లో ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్‌గా మారాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande