
హైదరాబాద్ , 18 సెప్టెంబర్ (హి.స.)సిద్దిపేట జిల్లా పరిధిలో ప్రభుత్వ భూములు, సెక్షన్ 22-ఎ పరిధిలోని స్థలాలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు, ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం అక్కడ ప్రత్యేకంగా పర్యటించింది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సులో సిద్దిపేటకు బయలుదేరిన ఈ బృందం, ఆక్రమణ ఆరోపణలు వచ్చిన సర్వే నంబర్లలోని స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో ప్రజాప్రతినిధులు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన భూ రికార్డుల మార్పులు, నిషేధిత జాబితా నుంచి తొలగించిన తీరుపై ప్రాథమిక వివరాలు సేకరించారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, నిజమైన పేదలకు కేటాయించే దిశగా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్