
హైదరాబాద్ , 18 సెప్టెంబర్ (హి.స.)నగరంలో శుక్రవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పాల వ్యాపారి భుజంగరావు (60)పై కత్తితో దాడి చేసి హత్య చేశారు.
గుర్రంగూడకు చెందిన భుజంగరావు పాల వ్యాపారం చేస్తుండగా.. ఆయన ఇంటి పక్కనే ఉండే శివేందర్ సింగ్ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం యాక్టివాపై భుజంగరావు పాలు తీసుకెళ్తుండగా శివేందర్ సింగ్ కత్తితో దాడి చేశాడు. అనంతరం శివేందర్ సింగ్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన భుజంగరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్