
ఆంధ్రప్రదేశ్ ( హి స ) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఖరీఫ్ వ్యవసాయ పరిస్థితులపై మాట్లాడారు. జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 688 మండలాల్లో 628 మండలాలు కరువు తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 51 శాతానికి పైగా ఉందని పేర్కొన్నారు. సాధారణంగా సాగు చేయాల్సిన విస్తీర్ణంతో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గిందని, సాధారణంగా 76 లక్షల ఎకరాల వరకు సాగు జరగాల్సి ఉండగా సుమారు 56.4 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాలు సాగుకు దూరంగా ఉన్నాయని, పంటలు వేసిన రైతులు కూడా వర్షాభావంతో నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. అనంతపురంలో సుమారు 5.80 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, కడపలో వర్షపాతం లోటు 52.9 శాతంగా ఉందని తెలిపారు. నెల్లూరు, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో సాగునీటి విడుదల, పంట నష్టాలు వంటి అంశాలను పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. విశాఖపట్నంలో తాగునీటి సరఫరా కూడా డిమాండ్కు తగ్గ స్థాయిలో లేదని ఆయన పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్