
హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ రాజకీయంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ను ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హుడిగా ప్రకటిస్తూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ఆయనకు అనుకూలంగా అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు పూర్తిగా రద్దు చేసింది.
సభ వెలుపలి చర్యలే అనర్హతకు ప్రధాన కారణం:
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరడమే కాకుండా 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బి-ఫామ్పై పోటీ చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరొక పార్టీ నుంచి నామినేషన్ వేయడం, ఎన్నికల్లో నిలబడటం స్వచ్ఛందంగా మూల పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడానికే సంకేతమని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. నామినేషన్ సమర్పించిన నాటి (2024 ఏప్రిల్ 23) నుంచే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హత కోల్పోయారని తీర్పులో పేర్కింది.
హైకోర్టును ఆశ్రయించిన ప్రతిపక్షాలు:
గతంలో ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడంతో, బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం ధర్మాసనం 91 పేజీలతో కూడిన ఈ తీర్పును వెలువరించింది.
స్టే అభ్యర్థన తోసిపుచ్చుతూ ఖైరతాబాద్ స్థానం ఖాళీ:
సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా తీర్పు అమలుపై తాత్కాలిక స్టే ఇవ్వాలని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు కోరినప్పటికీ, కోర్టు ఆ విజ్ఞప్తిని నిరాకరించింది. ఈ తీర్పుతో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఖాళీ అయినట్లయింది.
తీర్పుపై దానం స్పందన:
కోర్టు తీర్పు వెలువడిన అనంతరం దానం నాగేందర్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ఖైరతాబాద్కు ఎప్పుడు ఉపఎన్నికలు వచ్చినా మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi