హఫీజ్పేట్లో మహిళపై ఖాకీ అమానుషం: హోంగార్డ్ను డిస్మిస్ చేస్తూ పోలీసు శాఖ నిర్ణయం
హఫీజ్పేట్లో మహిళపై ఖాకీ అమానుషం: హోంగార్డ్ను డిస్మిస్ చేస్తూ పోలీసు శాఖ నిర్ణయం
dismis


హైదరాబాద్, 19 సెప్టెంబర్ (హి.స.)

నగరంలోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించిన హోంగార్డుపై పోలీస్ యంత్రాంగం వేటు వేసింది. బాధ్యతరహితంగా నడుచుకుంటూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అతడిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తూ (డిస్మిస్) ఉన్నతాధికారులు కఠిన ఉత్తర్వులు జారీ చేశారు.

అసలేం జరిగింది?

హఫీజ్‌పేట్ రైల్వే పరిసరాల్లో ఓ మహిళతో సదరు హోంగార్డ్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. సంయమనం పాటించాల్సిన పోలీసు సిబ్బంది, ఆవేశంతో ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. స్థానికులు చూస్తుండగానే ఆమె జుట్టు పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. బాధితురాలు ఎంతగా విలపించినా కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించాడు.

ఈ అమానుష దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో తీవ్ర దుమారం రేపింది. రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఇలా వీధి రౌడీల్లా వ్యవహరించడంపై నెటిజన్లు, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి.

శాఖాపరమైన విచారణ.. డిస్మిస్ వేటు:

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించారు. విచారణలో ఆ హోంగార్డ్ హద్దులు దాటి ప్రవర్తించినట్లు స్పష్టంగా ఆధారాలు లభించడంతో, క్రమశిక్షణారాహిత్యం కింద అతడిని విధుల్లోంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలతో మర్యాదగా నడుచుకోవాల్సిన సిబ్బంది ఇటువంటి అరాచకాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande