
ఆదిలాబాద్, 02 సెప్టెంబర్ (హి.స.)
అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రకాశ్ కుమార్ (22) అనే నిందితుడు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో సుమారు 140 మంది బాధితులను మోసం చేసి రూ.5.30 కోట్లకు పైగా నగదు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
ఇచ్చోడ పోలీస్టేషన్ పరిధిలోని ఓ మొబైల్ వ్యాపారిని సైతం ఇదే తరహాలో మోసం చేసి రూ.2.18 లక్షలను ఆన్లైన్లో బదిలీ చేయించుకున్నాడు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.
సోషల్ మీడియాలో తక్కువ ధరలకు వస్తువులు అందిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని పోలీసులు సూచించారు. విక్రేత వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆన్లైన్ కొనుగోళ్లు చేయాలని, అనుమానాస్పద లింకులు, క్యూఆర్ కోడ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
హిందూస్తాన్ సమాచార.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు