
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
గిరిజనులకు చెల్లించాల్సిన పెండింగ్ సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజన నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.
ఎన్నికల్లో గిరిజనులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నేడు వారికి సంక్షేమ పథకాలు, సబ్సిడీలను అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని నాయకులు మండిపడ్డారు.ఈ ఆందోళన సందర్భంగా నిరసనకారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గిరిజన యువతకు, నిరుపేదలకు ఉపాధి కల్పించే పథకాల నిధులను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..