పంజాబ్లో డ్రగ్స్ కలకలం: ఆప్ ప్రభుత్వంపై బీజేపీ సంచలన ఆరోపణలు
పంజాబ్లో డ్రగ్స్ కలకలం: ఆప్ ప్రభుత్వంపై బీజేపీ సంచలన ఆరోపణలు
Drugs


ఢిల్లీ, 21 సెప్టెంబర్ (హి.స.)

పంజాబ్‌లో తీవ్రరూపం దాల్చుతున్న మత్తు పదార్థాల విక్రయాలు, వాడకంపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలువుతోంది. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో భగవంత్ మాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. అసలైన డ్రగ్స్ సరఫరాదారులు, అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్న సామాన్య ప్రజలు, సమాచారమిచ్చే ఇన్ఫార్మర్లపైనే ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని బీజేపీ కీలక నేతలు విమర్శించారు.

గౌరవ్ భాటియా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితర సీనియర్ నాయకులు ఢిల్లీలో మాట్లాడుతూ.. పంజాబ్‌లో మత్తు పదార్థాల దందా అడ్డూఅదుపు లేకుండా సాగుతోందని ధ్వజమెత్తారు. డ్రగ్స్ వ్యాపారులకు ప్రభుత్వ రక్షణ లభిస్తోందని, వారిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చే వారికి మాత్రం బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ రహిత పంజాబ్‌ను నిర్మిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 'నషా ముక్త్ పంజాబ్ యాత్ర' పేరిట విస్తృత ప్రచారాన్ని చేపట్టింది. క్షేత్రస్థాయిలో బాధితులను పరామర్శిస్తూ, ఆప్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది.

కాగా, ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖండించారు. గతంలో బిజెపి-శిరోమణి అకాలీదళ్ కూటమి పాలనలోనే రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా మారాయని కౌంటర్ ఇచ్చారు. సరిహద్దుల గుండా జరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని, గుజరాత్‌లోని నౌకాశ్రయాల గుండా వస్తున్న మత్తు పదార్థాల సంగతేమిటని ఆప్ నేతలు నిలదీశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande