
ఆదిలాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)
రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (రిమ్స్) ఆదిలాబాద్ హాస్పిటల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి ఏసీ పేలి మంటలు చెలరేగడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలో 21 మంది తీవ్ర అస్వస్థతకు గురై ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎన్ఎస్ యుఏ) వార్డులో సోమవారం అర్థరాత్రి అకస్మాత్తుగా ఏసి భారీ శబ్దంతో పేలి దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది, శిశువుల తల్లిదండ్రులు అరుపులు కేకలతో హాహకారాలు చేయడంతో పరిస్థితి గమనించిన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
అంధకారంలో దట్టమైన పొగలు వ్యాపించగా చిన్నారులను బయటకు తీసేందుకు మార్గం లేక వార్డులోని అద్దాలు పగలగొట్టి తమ పిల్లలను బయటకు తీసుకొని పరుగులు పెట్టారు. అప్పటికే వార్డులో ఊపిరాడక నాలుగు రోజులు నిండని ఓ పసికందు మృత్యువాత పడింది. తీవ్ర అస్వస్థతకు గురై గాయాల పాలైన 8 మంది నవజాత శిశువులను నిజామాబాద్ మాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తుండగా నిర్మల్ వద్ద ఒకరు, నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మొత్తం 24 మంది నియో నాటికల్ ఇన్సెంటివ్ కేర్ వార్డులో చికిత్స పొందుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..