
అమరావతి , 22 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ సమగ్ర పురోగతిని కాంక్షిస్తూ ఏకంగా ₹1,500 కోట్ల విలువైన వివిధ మౌలిక వసతులు, సంక్షేమ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.
పట్టణంలో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ₹118 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణం, ₹100 కోట్లతో రహదారుల విస్తరణ పనులను చేపట్టారు. మంచినీటి ఎద్దడిని తీర్చడానికి జల్ జీవన్ మిషన్ ద్వారా ₹307 కోట్లతో మల్టీ-విలేజ్ పథకాన్ని, నాగులపల్లి రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ₹1.83 కోట్లతో 'పీఠికాపుర వనం' అర్బన్ ఫారెస్ట్ను, మైసమ్మ చెరువు సుందరీకరణ పనులను శ్రీకారం చుట్టారు. ఉప్పాడ తీరంలో కడలికోతను నివారించేందుకు ₹323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణం చేపడుతూనే, మహిళా స్వయం సహాయక సంఘాలకు ₹120 కోట్ల రుణాలు, మత్స్యకారులకు భద్రతా పరికరాలను అందజేశారు. పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్