
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) అప్రకటిత విద్యుత్ కోతలపై
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ రైతులు ఆందోళన చేపట్టారు. సకాలంలో విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు.
మంగళవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని రావిచేడ్ గ్రామంలో రైతులు కడ్తాల్-షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు మూడు గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు.
రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో పాటు విద్యుత్ కోతల సమస్యను తక్షణమే పరిష్కరించాలని అనంతరం రైతులు, గ్రామస్తులు, నాయకులు కలిసి విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. విద్యుత్ కోతల కారణంగా పాడి పశువుల సంరక్షణలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు