
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించినా పలువురు ఓటర్ల పేర్లు ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ముసాయిదా జాబితాలో కనిపించడం లేదు.
జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలోని పలువురు ఉద్యోగుల కుటుంబసభ్యుల పేర్లూ జాబితా నుంచి మాయమయ్యాయి. పూర్తి సమాచారం ఫారాలు సమర్పించినా.. ఎందుకిలా జరిగిందని వారు ఆశ్చర్యపోయారు.
సంబంధిత పోలింగ్ కేంద్రాల వివరాలు పరిశీలించగా ఫారాలు మొబైల్ యాప్లో ఎంట్రీ చేయలేదని తాజాగా గుర్తించారు. పూర్తి అవగాహనతో ఎన్నికల విభాగంలోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాలు సమర్పిస్తేనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సాధారణ పౌరుల విషయంలో ఏం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓ) తప్పిదాల వల్ల తమ పేరు జాబితాలో లేకుండా పోయిందని వేలాది మంది జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్, కేంద్ర కార్యాలయాలతో పాటు విచారణ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అయినా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఓటర్గా పేరు నమోదుకు మళ్లీ దరఖాస్తు (ఫారం-6) చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్