జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసుల రెడ్డికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం
మహిళపై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిలింగ్, బలవంతపు అబార్షన్ వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
Supreme Court


హైదరాబాద్ , 22 సెప్టెంబర్ (హి.స.)మహిళపై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిలింగ్, బలవంతపు అబార్షన్ వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేసు తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని, ఎలాంటి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని హైదరాబాద్ పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్పై విచారణ జరిపింది.

కేసు నేపథ్యం:

బాధితురాలి ఫిర్యాదుతో గతంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ఆయన మొదట తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం సీఐకి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ విచారణను వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande