
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) నగరంలోని మాదాపూర్ హోటల్లో మహిళ తీవ్రగాయాలతో మృతిచెందడం కలకలం రేపుతోంది.
ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు పరారైనట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలించేలోపే బాధితురాలు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఓయోలో దిగిన ఇద్దరు విశాఖ వాసులుగా తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. విశాఖకు చెందిన శ్రీనివాస రవితేజ, ఓ మహిళ నిన్న (సోమవారం) మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. మాదాపూర్ సిద్ధిక్ నగర్లోని ఓ ఓయో హోటల్లో ఇద్దరూ దిగారు. అయితే, ఈరోజు తెల్లవారుజామున సుమారు ఒంటి గంటకు కొండాపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి మహిళ మృతిపై మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన వారు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళకు తీవ్రగాయాలు అయ్యాయని పోలీసులకు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాధితురాలిని ప్రియుడు శ్రీనివాస్, ఓయో హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తీసుకువచ్చే లోపే ఆమె మృతిచెందినట్లు వివరించాయి. మహిళ మృతి విషయం తెలిసిన వెంటనే ఆమె ప్రియుడు కనిపించకుండా పోయాడని వెల్లడించాయి.
ఈ సందర్భంగా బాధిత మహిళ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆమె ముఖం, తలపై తీవ్రమైన గాయాలు, వాపు ఉండటాన్ని గమనించారు. అనంతరం ఓయో సిబ్బందిని తీసుకుని హోటల్ వద్దకు చేరుకున్నారు. వారి గదిలోని గోడలు, బెడ్షీట్పై రక్తపు మరకలను గుర్తించారు. వెంటనే క్లూస్ టీమ్ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీనివాస రవితేజ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్