
కుమ్రంభీం ఆసిఫాబాద్ , 22 సెప్టెంబర్ (హి.స.)కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రాబోయే రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (IMD) జిల్లాకు ప్రత్యేకాధికారిక అలర్ట్ జారీ చేసింది. ఈ హెచ్చరికలతో జిల్లా పాలనా యంత్రాంగం తీవ్రంగా స్పందిస్తూ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లాలోని ప్రవాహ ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న మారుమూల ఏజెన్సీ గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సహాయం కోసం పోలీస్, రెవెన్యూ శాఖలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉండే వంతెనలు, వాగుల వద్ద రవాణాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్